నేడు ఇందిరా మహిళా శక్తి మిషన్ ఆవిష్కరణ!
హైదరాబాద్, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి మరో కీలక ముందడుగు వేసింది. ఈ రోజు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభను ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి మిషన్ - 2025 ను అధికారికంగా ఆవిష్కరించనున్నారు.
సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల నాయకులు హాజరు కానున్నారు.
మహిళల అభివృద్ధికి కొత్త ఆశాజ్యోతి
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళల ఆర్థికాభివృద్ధికి కట్టుబడి ఉంది. మహిళలను ఆర్థికంగా స్వయంసమృద్ధులను చేయడం కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. తాజాగా, ఇందిరా మహిళా శక్తి మిషన్ - 2025 కు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ఈ మిషన్ కింద సెర్ప్ (SERP) మరియు మెప్మా (MEPMA) సంస్థలను విలీనం చేసి, కోటికి పైగా మహిళలకు రూ. లక్ష కోట్ల రుణం అందించనున్నారు. ఈ రుణ సహాయంతో మహిళలు వ్యవసాయం, వ్యాపారం, చిన్న తరహా పరిశ్రమలు, సేవా రంగాల్లో ముందుకు వెళ్లేందుకు మార్గం సుగమం కానుంది.
ఆర్టీసీలో మహిళా సంఘాల ప్రమేయం
ఈ మిషన్‌లో భాగంగా, 150 బస్సులను మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన అందించనున్నారు. తదుపరి దశలో మరో 450 బస్సులు అందించనుండగా, మొత్తం 600 బస్సులు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడవనున్నాయి. ఇది మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు, రాష్ట్ర రవాణా వ్యవస్థకు కూడా మేలు చేయనుంది.
మహిళా శక్తికి మరింత బలమైన అండ
ఇందిరా మహిళా శక్తి మిషన్ తెలంగాణ మహిళల ఆర్థిక సాధికారితకు, స్వయం సమృద్ధికి దోహదపడే చారిత్రాత్మక ప్రణాళికగా నిలవనుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా లక్షలాది మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలో మహిళా శక్తిని ప్రోత్సహించే ఒక ప్రధాన మైలురాయి కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Post a Comment