తెలంగాణకు నంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీ! బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఎంతో భారీగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సభ ప్రారంభంలో జమ్మూకాశ్మీర్‌లో పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి గౌరవంగా నిమిషం పాటు మౌనం పాటించారు.
ప్రసంగాన్ని ప్రారంభించిన కేసీఆర్, తెలంగాణ రాష్ట్రాన్ని చీకటి గమనంలోకి నడిపించిన ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. "1956లో నెహ్రూ తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపారు. 1969లో ప్రజలు ఉద్యమించినపుడు మళ్లీ అదే కాంగ్రెస్ పార్టీ అణిచివేసింది," అని కేసీఆర్ పేర్కొన్నారు. అప్పట్లో, ఇప్పుడూ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీనే ప్రధాన శత్రువని వ్యాఖ్యానించారు.
అనంతరం, చంద్రబాబు నాయుడు మీద కూడా విమర్శలు చేశారు. "తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధింపజేసింది చంద్రబాబే. స్పీకర్ ద్వారా రూలింగ్ తెచ్చారు," అని మండిపడ్డారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పూర్తి స్థాయిలో ఆగిపోయిందని కేసీఆర్ ఆరోపించారు. "ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలెన్నీ నేటి వరకు అమలు కాలేదు," అని ధ్వజమెత్తారు. పెన్షన్ డబులు పెంచుతామని, పేదలకు పెళ్లిళ్లకోసం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఆ హామీలను నీరుగార్చారని విమర్శించారు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప మరే హామీని కూడా నెరవేర్చలేదని కేసీఆర్ తెలిపారు. "అది కూడా చాలా మంది మహిళలు ఉపయోగించుకోవడంలేదని చెప్పారు," అని వ్యాఖ్యానించారు.
తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన బీఆర్ఎస్ ప్రభుత్వం తరువాత, ఇప్పుడు రాష్ట్రం అతి దయనీయ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. "మునుపటి రోజుల్లో భూముల ధరలు ఎలా పెరిగాయో, ఇప్పుడెలా క్షీణించాయో ప్రజలు చూడొచ్చు. విద్యుత్ సరఫరా తగ్గిపోయి మోటర్లు కాలిపోతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. మంచినీళ్ల కొరత ఏర్పడింది," అని కేసీఆర్ పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమై రైతులను దోపిడీకి గురి చేసిందని ఆరోపించారు. "మేము ప్రభుత్వ భూముల్లో పేదలకు పట్టాలు ఇచ్చాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే పేదల ఇళ్లను కూలుస్తోంది," అని మండిపడ్డారు.
దేశంలో తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దామని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అది 14వ స్థానానికి పడిపోయిందని అన్నారు. "మేము ఇప్పటి వరకు ఓపిక పట్టి మాట్లాడలేదు. ఇకపై ఊరుకోవడం లేదు. ముళ్లను ముళ్లతోనే తీయాలి," అంటూ పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
ప్రసంగం మద్యలో కొందరు కార్యకర్తలు "సీఎం, సీఎం" అంటూ నినాదాలు చేయడంతో కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. "అరిచేవాళ్లు మనవాళ్లేనా? బుద్ధి లేదా?" అంటూ వారిని తీవ్రంగా హెచ్చరించారు.

Post a Comment