ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం – ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్‌లో ప్రకంపనలు
బుధవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు మీద ఈ భూకంపం తీవ్రతను 5.9గా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ గుర్తించింది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూపూర్ ప్రాంతంలో భూమికి 75 కిలోమీటర్ల లోతులో నమోదైనట్లు పేర్కొన్నారు.
ఈ భూకంప ప్రభావం దూర ప్రాంతాల వరకూ విస్తరించింది. భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు స్థానిక నివాసితులు తెలిపారు. భూకంపం ఉదయం 4 గంటల 43 నిమిషాలకు ప్రారంభమైంది.
జమ్మూ కాశ్మీర్‌లో మరో ప్రకంపన
ఆఫ్ఘన్ భూకంపానికి కొన్ని నిమిషాల తరువాత జమ్మూకాశ్మీర్‌లోని కిష్ట్వార్ ప్రాంతంలో మరో స్వల్ప భూప్రకంపన నమోదైంది. ఉదయం 5:14 గంటలకు సంభవించిన ఈ ప్రకంపన తీవ్రతను రిక్టర్ స్కేల్ పై 2.4గా నమోదు చేశారు. భూకంప కేంద్రం 5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు వెల్లడించారు.
బంగ్లాదేశ్‌లోనూ ప్రకంపనలు
అలాగే బంగ్లాదేశ్‌లో కూడా తెల్లవారుజామున ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 5:07 గంటలకు వచ్చిన ఈ స్వల్ప భూకంపం తీవ్రత 2.9గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ప్రజలలో ఆందోళన
ఈ అనూహ్య భూకంపాల నేపథ్యంలో ప్రజలలో ఆందోళన చోటు చేసుకుంది. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తినష్టం గానీ సంభవించలేదని అధికారులు తెలిపారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పర్యవేక్షణ కొనసాగిస్తోంది. భూకంపాలు పునరావృతం కావచ్చని భావించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Post a Comment