యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పీర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యూనిట్-1 బాయిలర్ వద్ద ఆయిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయని సమాచారం.
సోమవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో బాయిలర్ నుండి ఆయిల్ లీక్ అయింది. అదే సమయంలో కింద జరిగుతున్న వెల్డింగ్ పనుల కారణంగా ఆ ఆయిల్‌కు మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు క్రమంగా యూనిట్ మొత్తం విస్తరించాయి. తీవ్రతరమైన మంటలు ఎగసిపడటంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ ప్రమాదం వల్ల 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోయింది. ట్రయల్ రన్‌కు సిద్ధమవుతున్న సమయంలోనే ఈ దుర్ఘటన జరగడం గమనార్హం.
ఇది మాత్రమే కాకుండా, ఇదివరకే ఫిబ్రవరి 14న కూడా యాదాద్రి పవర్ ప్లాంట్‌లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో యాష్ ప్లాంట్ ఈఎస్‌పీ (ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్) వద్ద వేడి బూడిద పడిపోవడంతో ఆరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. రెండో యూనిట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఈఎస్‌పీ వద్ద యాష్ జామ్ కావడం వల్ల యూనిట్ ట్రిప్ అయ్యి, బాయిలర్ నిలిచిపోయింది. జామ్ అయిన బూడిదను తొలగించే క్రమంలో ఒక్కసారిగా వేడి బూడిద పేలడంతో కార్మికులు గాయపడ్డారు. అప్పటి ఘటనలో గాయపడ్డవారికి వైద్య సహాయం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. యాదాద్రి పవర్ ప్లాంట్‌లో వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడం పట్ల కార్మికుల్లో మరియు స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. అధికార యంత్రాంగం మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది.
Post a Comment