-->

సింగరేణిలో సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి: ఐక్యవేదిక పిలుపు

సింగరేణిలో సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి: ఐక్యవేదిక పిలుపు


గోదావరిఖని, సింగరేణి బొగ్గు గనుల పరిరక్షణ కోసం ఈ నెల 20న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. శనివారం స్థానిక హెచ్‌ఎంఎస్ కార్యాలయంలో జరిగిన ఐక్యవేదిక సమావేశంలో పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఐఎన్టీయూ అధ్యక్షుడు ఐ.కృష్ణ, టీఎస్యూఎస్ నేత ఏడు కొండలు మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు గనులను ప్రైవేటీకరణకు గురిచేసే దిశగా చర్యలు తీసుకుంటోందని తీవ్రంగా మండిపడ్డారు. కార్మికుల భవిష్యత్తు, కుటుంబాల జీవనం హరించేదిగా ఈ విధానాలు మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

సింగరేణి పరిశ్రమను ప్రైవేట్ శక్తుల బారినుంచి రక్షించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటం చేయాలని నేతలు స్పష్టం చేశారు. సమ్మెను విజయవంతం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇవ్వగలమని వారు అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో నారాయణ, నరేశ్, సారయ్య, రాయమల్లు, కుమారస్వామి, రాజేశం, మల్లేశం, ప్రసాద్ రెడ్డి, రవీందర్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన జాతీయ నేత ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ (HMS) సింగరేణి కార్మికుల ఐక్యత అవసరాన్ని గుర్తుచేస్తూ, ఉద్యమం విజయవంతం కావాలంటే ప్రతి కార్మికుడు చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793