హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత
తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ గిరిజా ప్రియదర్శిని అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల న్యాయవ్యవస్థలో తీవ్ర విషాదం నెలకొంది. తోటి న్యాయమూర్తులు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది ఆమె కుటుంబానికి సంతాపం తెలియజేశారు.
జస్టిస్ గిరిజా ప్రియదర్శిని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ప్రాంతానికి చెందినవారు. 1995లో లాయర్‌గా న్యాయవృత్తిలోకి అడుగుపెట్టి, విశాఖ జిల్లా కోర్టులో సుమారు ఏడేళ్లు సేవలందించారు. ఆమె న్యాయ పరిజ్ఞానం, పట్టుదల కారణంగా 2008లో అదనపు జిల్లా జడ్జిగా నియమితులయ్యారు.
తర్వాత ఆమె ఖమ్మం ఫ్యామిలీ కోర్టులో మూడేళ్లపాటు సేవలందించారు. విజయనగరం మొదటి అదనపు జిల్లా జడ్జిగా, నంద్యాలలో అదనపు జిల్లా జడ్జిగా కూడా పనిచేశారు. 2017లో ఒంగోలు జిల్లా కోర్టు చీఫ్ జడ్జిగా పదోన్నతి పొందారు. అనంతరం ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల చీఫ్ జడ్జిగా బాధ్యతలు నిర్వహించారు.
హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడే ముందు, రాష్ట్ర లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీగా ప్రజలకు ఉచిత న్యాయసహాయం అందించడంలో విశేష కృషి చేశారు.
జస్టిస్ గిరిజా ప్రియదర్శిని మృతి న్యాయ రంగానికి తీరని లోటుగా భావిస్తున్నారు. ఆమె న్యాయసేవలకు గుర్తుగా, న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నివాళుల కార్యక్రమం నిర్వహించనున్నారు.

Post a Comment