అనుమతి లేని పత్తి, మిర్చి విత్తనాల విక్రయం – రూ.11.73 లక్షల విత్తనాలు సీజ్
చంద్రుగొండ మండల పరిధిలో అనుమతి లేని విత్తనాల అమ్మకాలపై అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. సుమారు రూ.11.73 లక్షల విలువైన పత్తి, మిర్చి విత్తనాలను స్థానిక పోలీసులు సీజ్ చేశారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
జూలూరుపాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో ఘటన వివరాలు వెల్లడించారు. సుజాతనగర్ గ్రామానికి చెందిన ఓ విత్తన షాపు యజమాని, నిబంధనలకు విరుద్ధంగా, జ్యుడీషియల్ పరిధిని దాటి చంద్రుగొండ మండలంలోని బెండలపాడు గ్రామ శివారులో మొబైల్ వ్యాన్ ద్వారా విత్తనాలను విక్రయిస్తున్నారని నమ్మకమైన సమాచారం అందిందన్నారు.
దీనిపై స్పందించిన మండల వ్యవసాయాధికారి జీ వినయ్, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రైతుల నుంచి వివరాలు సేకరించారు. విత్తనాలపై ఎలాంటి అధికార అనుమతులు, లైసెన్సులు లేకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 105 పత్తి విత్తనాల ప్యాకెట్లు, 1025 మిర్చి విత్తనాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 11,73,250 అని అధికారులు తెలిపారు.
రైతులకో హెచ్చరిక: అనుమతి లేని విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలి
ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, గ్రామాల్లో అనుమతులు లేని విత్తనాలను విక్రయించే వారిపై పీడీ యాక్ట్ కూడా అమలులోకి వస్తుందని హెచ్చరించారు. రైతులు ఇలాంటి సంఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
ఇక వ్యవసాయ శాఖ మరియు పోలీసు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గ్రామాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నామని, టాస్క్ ఫోర్స్ బృందాలు కూడా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తాయని తెలిపారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో అధిక దిగుబడుల పేరుతో అనుమతి లేని విత్తనాలు విక్రయించే వ్యక్తుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఈ తనిఖీలలో సబ్‌ఇన్‌స్పెక్టర్ శివరామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ, కానిస్టేబుల్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment