"షేక్ హ్యాండ్స్ వద్దు!" – వర్షాకాలానికి తెలంగాణ ప్రభుత్వ హెల్త్ అలర్ట్
హైదరాబాద్, రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.
పనిలో పనిగా ప్రమాదం..!
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇంట్లో తలుపులు, కిటికీలపై దోమ తెరలు ఉపయోగించాలి. నీరు నిల్వ ఉండే ప్రదేశాలను శుభ్రంగా ఉంచాలి. ఇంటి పరిసరాల్లోని సెప్టిక్ ట్యాంకులు, డబ్బాలు, గుంటలు వంటి చోట్ల నీరు నిల్వ కాకుండా చూడాలి.
ఆహారం, నీరు – శుభ్రత తప్పనిసరి
పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలని, కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించింది. బయట ఆహారం తీసుకోవడం, కలుషిత నీటిని ఉపయోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంది.
జలుబు, జ్వరం, దగ్గు..? వెంటనే డాక్టర్‌ను కలవండి
ఈ రుతువులో సాధారణ లక్షణాలుగా కనిపించే జలుబు, జ్వరం, దగ్గు వంటి వాటిని నిర్లక్ష్యం చేయకూడదని, ఇవి తీవ్రమైన అంటువ్యాధులకు సంకేతాలయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
షేక్ హ్యాండ్స్ తగ్గించండి – శానిటైజర్ తప్పనిసరి!
వ్యక్తిగత పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంటూ, బయట వ్యక్తులతో చేతులు కలిపే అలవాటును తగ్గించాలని, అవసరమైతే శానిటైజర్ వాడాలని సూచించింది.
Post a Comment