-->

యెమెన్‌లో కీలక నిర్ణయం భారతీయ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు

యెమెన్‌లో కీలక నిర్ణయం భారతీయ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు


సనా,: యెమెన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియకు జీవన ఆశ వెలుగుతున్నది. సోమవారం అర్ధరాత్రి యెమెన్‌ ప్రభుత్వం ఆమెపై విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ మతపరమైన ప్రముఖ నేత కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. అయితే ఇప్పటికీ భారత విదేశాంగ శాఖ నుంచి అధికారిక స్పందన రాలేదు.

ఈ నిర్ణయానికి ముందు యెమెన్‌ రాజధాని సనాలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉత్తర యెమెన్‌ ఉన్నతాధికారులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొన్నారు. భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్‌లోని ప్రముఖ సూఫీ పండితుడు షేఖ్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం చర్చల కోసం నియమించబడింది. అబూబకర్ ముస్లియార్ సైతం యెమెన్ ప్రభుత్వంతోపాటు ఇతర అంతర్జాతీయ వేదికలపై మధ్యవర్తిత్వం చేపట్టారు.

ఈ చర్చల ఫలితంగా నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు అయ్యిందని, అయితే ఆమె విడుదలపై ఇంకా స్పష్టత లేదని ‘యెమెన్ యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మహదీ జస్టిస్’ ప్రతినిధి సర్హాన్ షంశాన్ అల్ విశ్వాబి పేర్కొన్నారు. ఆమెను జైలు నుండి విడుదల చేస్తారా లేదా జీవిత ఖైదు విధిస్తారా అన్న అంశంపై తుది నిర్ణయం మరి కొద్దిరోజుల్లో తలాల్ మహదీ కుటుంబంతో జరగనున్న చర్చల అనంతరం వెల్లడికానుంది.

ఇకపై తదుపరి చర్యలు కేసులో మరణించిన తలాల్ మహదీ కుటుంబ సభ్యులతో భారత ప్రభుత్వం జరిపే సంప్రదింపులపై ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం యెమెన్ ప్రభుత్వం జులై 16న అమలవాల్సిన ఉరిశిక్షను వాయిదా వేసినప్పటి నుంచి భారత విదేశాంగ శాఖ యెమెన్ అధికారులతో గట్టి చర్చలు జరుపుతోంది. భారతీయులైన నిమిష ప్రియ కుటుంబసభ్యులు, మతపరమైన నాయకులు, పౌర సమాజం ఈ నిర్ణయాన్ని శుభ పరిణామంగా పేర్కొంటున్నారు..

Blogger ఆధారితం.