డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కుక్కల స్వైరవిహారంతో కాలనీవాసులు భయందొలన్లు
తూప్రాన్, మెదక్ జిల్లా: తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో పారిశుద్ధ్య సమస్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కాలనీలో పిచ్చిమొక్కలు పెరిగిపోయిన కారణంగా విష సర్పాలు, తేళ్లు, జెర్రీలు ఇళ్లలోకి చొచ్చుకొస్తుండటంతో ప్రజలు రోజూ భయాందోళనల మధ్య జీవనం గడుపుతున్నారు. దోమలు, ఈగలు అధికంగా వృద్ధి చెంది మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశముంది.
ఇవన్నీ కలిపి ప్రజల జీవనాన్ని భారమయ్యేలా చేస్తున్నా, సంబంధిత మున్సిపల్ అధికారులు మాత్రం పైపై చర్యలకే పరిమితమవుతూ సమస్యలను దాటి పారేస్తున్నారని కాలనీవాసులు వాపోతున్నారు.
ఇంతే కాక, కాలనీలో స్వైరంగా తిరుగుతున్న మూక కుక్కల బారిన పడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో పిల్లలు, మహిళలు నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉద్యోగాలకు వెళ్లే గృహిణులు కుక్కల దాడులకు గురై భయాందోళనల్లో ఉన్నారు.
"మున్సిపల్ పరిధిలో మేము లేమా? ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రత్యేక అధికారుల పరిపాలనలో మాకు సౌకర్యాలేదూ, రక్షణ లేదు. ఇలాంటిది ఎంతకాలం?" అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా పరిపాలన యంత్రాంగం, మున్సిపల్ అధికారులు స్పందించి కాలనీలో తక్షణమే పరిశుభ్రత చర్యలు చేపట్టి, ప్రజలకు మౌలిక సదుపాయాలు, రక్షణ కల్పించాలని కాలనీవాసులు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.
Post a Comment