-->

ప్రియుడితో మాట్లాడుతోందన్న అనుమానంతో అక్కను హత్య చేసిన తమ్ముడు!

ప్రియుడితో మాట్లాడుతోందన్న అనుమానంతో అక్కను హత్య చేసిన తమ్ముడు!


పెంజర్ల గ్రామంలో దారుణ ఘటన – వైరు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య – పోలీసులు కేసు నమోదు

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామంలో మానవతను కలిచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ సంబంధం కొనసాగిస్తోందని అనుమానంతో తమ్ముడు తన సొంత అక్కను హత్య చేసిన ఘోర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ఘటన వివరాలు ఇలా…
గ్రామానికి చెందిన మేస్త్రీ దేశాల రాఘవేందర్, సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె రుచిత (21) డిగ్రీ పూర్తిచేసి ఎంబీఏ ప్రవేశానికి సిద్ధమవుతోంది. అదే గ్రామానికి చెందిన యువకుడితో ఆమెకు గతంలో ప్రేమ సంబంధం ఉండేది. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు పెంచిన గొడవల నేపథ్యంలో పంచాయతీ జరగడంతో, ఆ సంబంధాన్ని ముగించినట్లు కుటుంబానికి హామీ ఇచ్చినట్టు తెలిసింది.

అయితే, ఇటీవల రుచిత మళ్లీ ఆ యువకుడితో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు తమ్ముడు రోహిత్‌ (20) గమనించాడు. దీంతో అక్కను పదే పదే మందలించడమే కాక, ఎట్టకేలకు నిన్న ఆమెపై ప్రాణాలు తీసేంతటి ఘాతుకానికి పాల్పడ్డాడు.

వైరు బిగించి హత్య...
జూలై 28న తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో రుచిత తన ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని గమనించిన రోహిత్, ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో ఉన్న రోహిత్ ఇంట్లో ఉన్న ఒక వైరుతో రుచిత మెడను బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.

స్పృహ కోల్పోయిందని కలకలం...
ఘటన అనంతరం రోహిత్ బంధువులకు ఫోన్ చేసి "అక్క స్పృహ కోల్పోయింది" అని సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి చేరుకుని విషయం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రోహిత్‌ను అరెస్టు చేసిన పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో అతను నేరాన్ని అంగీకరించినట్టు తెలిపారు.

కుటుంబ గొడవలు – ప్రేమ వ్యవహారాల మధ్య ఘాతుకం
ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గతంలోనూ ప్రేమ వ్యవహారాలపై కుటుంబాల్లో జరిగిన ఘర్షణలు పలుమార్లు పరువు హత్యలకు దారితీశాయి. 2023లో షాద్‌నగర్‌లో జరిగిన పరువు హత్య ఘటనను ఇది తలపిస్తుంది.

Blogger ఆధారితం.