-->

మందమర్రి యువతిపై ఆన్‌లైన్ వేధింపులు – నిందితుడు అరెస్ట్

మందమర్రి యువతిపై ఆన్‌లైన్ వేధింపులు – నిందితుడు అరెస్ట్


మందమర్రి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని నకిలీ ఈమెయిల్ ఐడి సృష్టించి అసభ్యకరమైన, అశ్లీల సందేశాలతో వేధించిన వ్యక్తిని మందమర్రి పోలీసులు అరెస్ట్ చేశారు.

మందమర్రికి చెందిన యువతి మార్చి 2025 నుండి గుర్తు తెలియని వ్యక్తి పంపిస్తున్న అసభ్యకర మెయిల్స్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వేధింపులు రోజురోజుకు పెరగడంతో బాధితురాలు జూన్ 7న మందమర్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు ఎస్సై రాజశేఖర్ ఐటీ చట్టం కింద కేసు నమోదు చేయగా, సిఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించిన పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టైన నిందితుడు నెల్లి నిఖిల్ బాబు (29), స్టార్ హెల్త్‌లో పాలసీ అడ్వైజర్‌గా పనిచేస్తున్నాడు. బాధితురాలు గతంలో హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు నిఖిల్ బాబు ఆమె సహోద్యోగి. ప్రేమను తిరస్కరించడంతో ప్రతీకార భావంతో ఆమె ప్రతిష్టకు భంగం కలిగించాలనే ఉద్దేశంతో ఈమెయిల్స్ పంపినట్టు విచారణలో ఒప్పుకున్నాడు. నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

“మహిళల భద్రతకు తెలంగాణ పోలీస్ శాఖ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఆన్‌లైన్‌లో వేధింపులు చేసే వారిని వదిలిపెట్టేది లేదు” అని సిఐ శశిధర్ రెడ్డి హెచ్చరించారు.

ప్రజలకు పోలీసుల సూచనలు:

  • వ్యక్తిగత వివరాలను అపరిచితులతో పంచుకోవద్దు.
  • సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్‌గా ఉంచుకోండి.
  • బలమైన పాస్‌వర్డ్‌లు ఉపయోగించండి.
  • వేధింపులకు స్పందించవద్దు, సాక్ష్యాలుగా స్క్రీన్‌షాట్‌లు భద్రపరచుకోండి.
  • నిందితుడి ఖాతాను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి.
  • ఏవైనా ఆన్‌లైన్ వేధింపులు ఎదురైనా వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793