భద్రాద్రి జిల్లాకు రాష్ట్ర స్థాయి సంపూర్ణత అభియాన్ అవార్డు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ సంయుక్తంగా చేపట్టిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో ఉత్తమ ప్రదర్శన కనబర్చినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది.
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లతో కలిసి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కు అవార్డును ప్రదానం చేశారు.
సంపూర్ణత అభియాన్‌లో భాగంగా విద్య, ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, మౌలిక వసతులు, సామాజిక సంక్షేమం వంటి ఆరు సూచికలపై 100 శాతం అభివృద్ధి లక్ష్యంగా పనులు చేపట్టారు. ఈ విధంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడు కీలక సూచికలపై పూర్తిస్థాయిలో మెరుగుదల సాధించి రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.
ఇంతేకాక, గుండాల మండలం ఐదు సూచికల్లో అగ్రస్థానంలో నిలిచి ఆకాంక్షిత బ్లాక్‌లకు ఆదర్శంగా నిలిచింది. నీతి ఆయోగ్ అధికారులు చేసిన సమీక్షల ఆధారంగా జిల్లా ఈ పురస్కారానికి ఎంపికైంది.
కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్పందిస్తూ...
"ఈ అవార్డు జిల్లాలోని అధికార యంత్రాంగం, మండల సిబ్బంది, గ్రామస్థాయి ఉద్యోగులు, ప్రజల సమిష్టి కృషికి గుర్తింపు. ప్రతి గ్రామ అభివృద్ధే మా లక్ష్యం. అన్ని శాఖల సమన్వయంతో, స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లిన ఫలితమే ఇది. ఇది మరింత బాధ్యతను అందజేస్తోంది. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిలో స్థిరత్వాన్ని సాధిస్తాం" అని పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లా, అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని కలెక్టర్ వ్యక్తం చేశారు.
Post a Comment