కడుపుమాడ్చి.. ఎముకల గూడులా చేసి హత్య
అశ్వారావుపేటలో వివాహిత అనుమానాస్పద మృతి
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో ఒక వివాహిత అనుమానాస్పద మరణం కలకలం రేపింది. మృతురాలు లక్ష్మీప్రసన్న (33). 2015లో ఖాన్‌ఖాన్‌పేటకు చెందిన పూల నరేశ్‌బాబుతో ఆమె వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. అయితే నరేశ్‌బాబు, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం లక్ష్మీప్రసన్నను పదే పదే వేధించారని, తిండి పెట్టక గృహనిర్బంధంలో ఉంచి హింసించారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
శనివారం నరేశ్‌బాబు అత్తామామలకు ఫోన్ చేసి “లక్ష్మీప్రసన్న మెట్లపై నుంచి పడి గాయపడింది, ఆసుపత్రిలో చేర్పించాం” అని తెలిపాడు. వారు రాజమహేంద్రవరం ఆసుపత్రికి చేరుకునే సరికి ఆమె మృతిచెందింది. శరీరం అంతా కొత్త, పాత గాయాల ముద్రలు ఉండగా.. బలహీనతతో ఎముకల గూడులా మారిన కుమార్తెను చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ హత్యకు నరేశ్‌బాబు, అతని తల్లి విజయలక్ష్మి, అక్క భూలక్ష్మి, బావ శ్రీనివాసరావు కారణమని మృతురాలి తండ్రి ముదిగొండ వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అశ్వారావుపేట ఎస్సై యయాతి రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Post a Comment