-->

సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం : సీఎం రేవంత్ రెడ్డి

సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం : సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్‌ : తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఆదివారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులతో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

సినిమా కార్మికుల సమస్యలపై నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి సమగ్ర విధానం రూపకల్పన చేస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పరిశ్రమలో సుహృద్భావ వాతావరణం నెలకొనడం అవసరమని, సమస్యలపై కార్మికులతో కూడా త్వరలో చర్చిస్తానని స్పష్టం చేశారు.

సినిమా రంగంలోకి కొత్తగా వచ్చే వారికి అవసరమైన నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం కార్పస్ ఫండ్‌ ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఈ దిశగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

తెలంగాణలో తెలుగు సినిమా పరిశ్రమ ఒక ప్రధాన రంగంగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని గుర్తుచేసిన సీఎం, ఇటీవల కార్మికుల సమ్మె విరమణలో తన చొరవతో పరిష్కారం సాధ్యమైందని తెలిపారు. నిర్మాతలు–కార్మికుల మధ్య సంస్కరణలు అవసరమని, పరిశ్రమ కోసం ఒక నియమావళి రూపొందించుకోవాలని సూచించారు. పరిశ్రమలో ఎవరూ చట్టం దాటి వ్యవహరించరాదని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణలో తెలుగు సినిమాల చిత్రీకరణ విస్తృతంగా జరగాలని, అంతర్జాతీయ స్థాయిలో పరిశ్రమను నిలబెట్టడమే లక్ష్యమని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు అల్లు అరవింద్, డి.సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని, డివివి దానయ్య, బాపినీడు, చెరుకూరి సుధాకర్, విశ్వప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, రాధామోహన్, దాము తదితరులు పాల్గొన్నారు. అలాగే దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల తదితరులు హాజరయ్యారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793