కరివేపాకే కదా అని ఈజీగా తీసిపారేయొద్దు!
కరిలో రుచి, వంటకంలో వాసన కోసం వేస్తే చాలు… వెంటనే ప్లేట్ నుంచే తొలగించేస్తాం. కానీ అదే కరివేపాకు రైతుల కోసం వాణిజ్య పంటగా మారి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతోందని మీకు తెలుసా? సాధారణంగా కనిపించే ఈ ఆకే తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరానికి రూ.100 కోట్లకు పైగా వ్యాపారం చేస్తోంది.
ఒక్కసారి నాటితే 30 ఏళ్ల దిగుబడి
ఒకసారి విత్తనం వేస్తే 30 సంవత్సరాల వరకు నిరంతరంగా దిగుబడి వస్తుంది. గుంటూరు జిల్లా పెదవడ్లపూడి కరివేపాకు సాగుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అక్కడి నుంచి ఇతర జిల్లాలకూ విస్తరించింది. అనంతపురం (తాడిపత్రి, పెద్దపప్పూరు), ప్రకాశం (దర్శి), వైఎస్సార్ కడప (జమ్మలమడుగు), పల్నాడు, బాపట్ల, కృష్ణా జిల్లాలు, అలాగే తెలంగాణలోని హైదరాబాద్ శివార్లలోనూ సాగు జోరుగా సాగుతోంది.
ఎకరానికి లక్ష రూపాయల ఖర్చు
ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనశాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం 3,000 ఎకరాలకుపైగా కరివేపాకు సాగు జరుగుతోంది. రైతులు మాత్రం ఈ విస్తీర్ణం మరింత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఎకరానికి సంవత్సరానికి సుమారు రూ.1 లక్ష ఖర్చు అవుతుంది. దానికి ప్రతిగా దాదాపు 20 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి లభిస్తుంది.
ధర & మార్కెట్
నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు మెట్రిక్ టన్నుకు రూ.30,000 – రూ.40,000 వరకు ధర వస్తుంది. మిగతా నెలల్లో రూ.10,000 – రూ.30,000 వరకూ లభిస్తుంది. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలతో పాటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోయంబత్తూరు, ముంబైలకు రోజూ 50–60 లారీలు తరలిస్తారు. ఒక్కో లారీ సగటున 4.5 టన్నుల లోడుతో బయలుదేరుతుంది. రవాణా సమయంలో ఆకులు నల్లబడకుండా ప్రతి 50–60 కిలోమీటర్లకు నీటితో తడుపుతారు.
ఎగుమతులు
గతంలో ముంబై నుంచి ఫ్రాన్స్, జర్మనీ, దుబాయ్‌కు ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం పురుగుమందుల అధిక వినియోగం కారణంగా ప్రధానంగా దుబాయ్‌కే ఎగుమతి జరుగుతోంది.
గుంటూరే విత్తనాల కేంద్రం
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ సాగు మొదలు పెట్టినా, విత్తనాలను గుంటూరు జిల్లా పెదవడ్లపూడి నుంచే తీసుకెళ్తారు. అక్కడి రైతులు కరివేపాకు సాగులో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు.
👉 ప్లేట్ మీద పడగొట్టే ఈ చిన్న ఆకే ఇప్పుడు రైతుల జీవితాలను మార్చేస్తోంది. రుచి కోసం వంటలో వేయడం మాత్రమే కాదు, కోట్ల ఆదాయం తెచ్చే పంట కూడా ఇదే!

Post a Comment