ఎన్‌సిసి శిక్షణతో దేశభక్తి, క్రమశిక్షణతో సమాజానికి ఆదర్శంగా నిలవాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
మణుగూరు, సెప్టెంబర్ 12: ఎన్‌సిసి శిక్షణతో ప్రతి విద్యార్థి దేశభక్తి, క్రమశిక్షణ, నిబద్ధత వంటి విలువలను అలవర్చుకుని సమాజానికి ఆదర్శప్రాయంగా నిలవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు.
మణుగూరు మిట్టగూడెం తెలంగాణ గిరిజన గురుకుల కళాశాలలో జరుగుతున్న ఎన్‌సిసి క్యాంపును శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా క్యాడెట్లతో సంభాషిస్తూ, “విద్యతో పాటు జిజ్ఞాస, విమర్శనాత్మక ఆలోచన, సహకారం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందితేనే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోగలరు” అని అన్నారు.
ఎన్‌సిసి ద్వారా లభించే అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించిన కలెక్టర్, ఈ శిక్షణ సివిల్ సర్వీసులు, రక్షణ రంగం, ఇతర పోటీ పరీక్షల్లో విజయానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో క్యాడెట్లు కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌సిసి కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎస్.కె. భద్ర, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కల్నల్ నవీన్ యాదవ్, కళాశాల ప్రిన్సిపాల్ రవి బండారుపల్లి, తహశీల్దార్, ఎంపిడిఓ, ఎంపిఓలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Post a Comment