సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గ్రూప్-1 నియామకాలపై రౌండ్ టేబుల్ సమావేశం
హైదరాబాద్, అక్టోబర్ 9: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గ్రూప్-1 నియామకాల్లో జరిగిన అవకతవకలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.
కవిత మాట్లాడుతూ, “గ్రూప్-1 విషయంలో ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టనున్నాం. అక్టోబర్ 15న డివిజన్ బెంచ్ ఇచ్చే తీర్పుపైనే విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంది. అందుకే 15వ తేదీ వరకు పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం” అని తెలిపారు.
ఆమె కొనసాగిస్తూ, “నిన్న విద్యార్థి అమరవీరులకు నివాళులు అర్పించి, వారి సాక్షిగా ఈ పోరాటాన్ని ప్రారంభించాం. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపేందుకే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి ఫలితాల విడుదల దాకా ప్రతి దశలోనూ తప్పులు జరిగాయి. ఈ విషయాన్ని నేను మండలిలో కూడా ప్రస్తావించాను. అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది” అని పేర్కొన్నారు.
కవిత ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఈ తప్పులను ఎండగట్టాల్సిన అవసరం ఉంది. మీడియా, సోషల్ మీడియా కూడా ప్రభుత్వ అవకతవకలను వెలుగులోకి తీసుకువస్తున్నాయి. వారి ఒత్తిడి కారణంగానైనా ప్రభుత్వం కొంతైనా బుద్ధి తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నియామకాలు రద్దు చేసి, మళ్లీ రీ ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంది” అని అన్నారు.
ఆమె చివరగా పేర్కొన్నది, “ఈ సమావేశంలో తీసుకున్న తీర్మానాలను గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి పంపిస్తాం. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగితే మేము నిశ్చలంగా ఉండము. విద్యార్థులకు ‘జాగృతి’ ఎల్లప్పుడూ భరోసాగా ఉంటుంది” అని కవిత హామీ ఇచ్చారు.
Post a Comment