-->

కోల్డ్‌రిఫ్ దగ్గు మందు కేసులో ఫార్మా యజమాని అరెస్ట్

కోల్డ్‌రిఫ్ దగ్గు మందు కేసులో ఫార్మా యజమాని అరెస్ట్


హైదరాబాద్‌, అక్టోబర్‌ 09: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన కోల్డ్‌రిఫ్ దగ్గు మందు విషాదం కేసులో కీలక మలుపు తిప్పుకుంది. మధ్యప్రదేశ్‌లో ఈ మందు సేవించిన తర్వాత చిన్నారుల్లో మూత్రపిండాల వైఫల్యం కారణంగా 20 మంది మరణించిన ఘటనపై అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు.

తాజాగా మధ్యప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చెన్నైలో శ్రేసన్ ఫార్మా యజమాని రంగనాథన్‌ను అరెస్ట్ చేసింది. గురువారం ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి, అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సూక్ష్మ పరీక్షల్లో కోల్డ్‌రిఫ్ దగ్గు మందులో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మందు సేవించిన చిన్నారులు కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌కి గురై, చివరికి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌తో పాటు రాజస్థాన్‌లో కూడా ఇలాంటి మరణాలు చోటుచేసుకున్నాయని స్థానిక ఆరోగ్య శాఖలు నివేదికలు సమర్పించాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కోల్డ్‌రిఫ్ దగ్గు మందు వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి.

ప్రస్తుతం రంగనాథన్‌ను విచారణ నిమిత్తం మధ్యప్రదేశ్‌కి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. దర్యాప్తు అధికారులు మందు తయారీ ప్రక్రియ, నాణ్యత ప్రమాణాల ఉల్లంఘనలపై సవివరంగా విచారణ చేపట్టనున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793