అంగన్‌వాడీల్లో 14 వేల పోస్టుల భర్తీకి సీతక్క ఆదేశాలు
స్టే ఎత్తివేతకు వెంటనే చర్యలు — 10 రోజుల్లో మార్గం సుగమం చేయాలని సూచన
హైదరాబాద్, అక్టోబర్ 29: అంగన్‌వాడీల్లో ఖాళీగా ఉన్న 14 వేల పోస్టుల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ (సీతక్క) ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీలకు 100 శాతం రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు విధించిన స్టే ఆర్డర్‌ను ఎత్తివేయేందుకు వెకేట్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు.
ఈ మేరకు మంగళవారం సచివాలయంలో సమావేశం నిర్వహించిన సీతక్క, నియామకాలపై కొనసాగుతున్న న్యాయ చిక్కులపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో లా సెక్రటరీ బీ. పాపిరెడ్డి, పీఆర్సీ చైర్మన్ ఎన్. శివశంకర్, శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా పాల్గొన్నారు.
గతంలో ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీలకు 100 శాతం రిజర్వేషన్ కల్పించడంతో మొత్తం రిజర్వేషన్ 50 శాతం పరిమితిని మించడం వల్ల కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా, సుప్రీంకోర్టు స్టే విధించింది.
అధికారులు ఈ సందర్భంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అంగన్‌వాడీ పోస్టులను ప్రభుత్వ సర్వీస్‌గా పరిగణించకపోవడంతో 50% రూల్ వర్తించట్లేదని మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన సీతక్క, “ఇక్కడ కూడా అదే విధానం అమలు చేసి, సుప్రీంకోర్టులో వెకేట్ పిటిషన్ దాఖలు చేయాలి. 10 రోజుల్లోగా నియామక ప్రక్రియకు మార్గం సుగమం చేయాలి” అని ఆదేశించారు.
కొత్త నియామకాలు అమలులోకి వస్తే అంగన్‌వాడీ సేవలు మరింత బలోపేతం అవుతాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Post a Comment