ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు కొత్త హంగులు
హైదరాబాద్ : అక్టోబర్ 29: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవనాలకు చివరికి కొత్త రూపు రాబోతోంది. ఏళ్ల తరబడి మరమ్మత్తులకు నోచుకోక విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందులు పడుతుండగా—ఇప్పుడు ప్రభుత్వం స్పందించింది.
ఇంటర్మీడియట్ విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 429 ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవనాలకు కొత్త రంగులు వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ సంచాలకుడు ఎస్. కృష్ణ ఆదిత్య మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని తెలుపు రంగుతో పాటు చివరన నీలిరంగుతో అలంకరించాలని నిర్ణయించారు. దీనికి కావలసిన వ్యయాన్ని మైనర్ రిపేర్ల ఫండ్ నుంచి వినియోగించాలని స్పష్టంచేశారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఐఈవోలు, నోడల్ అధికారులు, ప్రిన్సిపాళ్లు తక్షణం చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల భవనాలు ఆకర్షణీయంగా ఉండటం వల్ల విద్యార్థులు వాటివైపు ఆకర్షితులవుతున్నారన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ప్రభుత్వ కళాశాలలు కూడా అందంగా, ఆధునికంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది.
ఈ చర్యలతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా కొత్త మెరుపుతో విద్యార్థులను ఆకర్షించనున్నాయి.

Post a Comment