బిర్యానీ పాషా అరెస్ట్ — 7 కిలోల వెండి, బంగారం సీజ్
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 8: తాళం వేసిన ఇల్లు కనిపిస్తే చాలు... కన్నం వేసి దోపిడీ చేసే అలవాటు. బిర్యానీ పెడితే తినేలోపు చేసిన దొంగతనాలన్నీ ఒప్పేసుకునే విచిత్రమైన దొంగ. ఇతడే మహబూబ్ పాషా అలియాస్ బిర్యానీ పాషా! వరుస దొంగతనాలు చేసి పోలీసులకు మళ్లీ చిక్కిన ఈ ఘరానా దొంగ వద్ద భారీగా వెండి, బంగారం స్వాధీనం అయింది.
మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన మహమూద్ పాషా అలియాస్ బిర్యానీ పాషా ఒకవైపు కారు డ్రైవర్‌గా పనిచేస్తూ మరోవైపు చోరీలతో జీవనం సాగిస్తున్నాడు.
గత నెల 29న బాలాజీనగర్‌లో మాచన్‌పల్లి రాజేశ్వర్‌రెడ్డి ఇంట్లో జరిగిన దొంగతనంలో రూ. 20 వేల నగదు, 4 కిలోల వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
మంగళవారం రామయ్యబౌళి ట్యాంక్‌బండ్ వద్ద ఓ కారు అనుమానాస్పదంగా కనిపించడంతో వన్‌టౌన్ సీఐ అప్పయ్య, సీసీఎస్ సీఐ రత్నం పరిశీలించారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన మహబూబ్‌పాషాను పట్టుకున్నారు. కారు సోదాలో 7 కిలోల వెండి వస్తువులు, 43 గ్రాముల బంగారు నగలు, రూ. 26,600 నగదు లభించాయి.
విచారణలో అతడు మహబూబ్‌నగర్ రూరల్‌లో 5, వన్‌టౌన్‌లో 1, టూ టౌన్‌లో 2, దేవరకద్రలో 2 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. పోలీసుల ఆధ్వర్యంలో స్వాధీనం చేసిన ఆస్తులను కోర్టులో సమర్పించారు.
తాళం వేసిన ఇళ్లను మాత్రమే టార్గెట్ చేసుకునే పాషాకు ఇద్దరు భార్యలు, ఏడుగురు పిల్లలున్నారు. కేసు పరిష్కారంలో కీలక పాత్ర పోషించిన సీఐ అప్పయ్య, సీఐ రత్నం, ఫింగర్‌ప్రింట్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, ఎస్‌ఐలు శీనయ్య, చంద్రమోహన్, రమేశ్, ఏఎస్‌ఐ శ్రీనివాసులు, కానిస్టేబుళ్ళు శేఖర్, పవన్‌కుమార్, ప్రవీణ్
కుమార్‌లను ఎస్పీ జానకి అభినందించారు.
Post a Comment