బ్రాందీ షాపు పర్మిట్ రూమ్‌లో విస్కీ తాగుతూ యువకుడు మృతి
ఏలూరులో విస్కీ తాగి యువకుడు మృతి
ఏలూరు, అక్టోబర్ 10: ఏలూరు పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక బ్రాందీ షాపు పర్మిట్ రూమ్‌లో విస్కీ తాగుతూ ఓ యువకుడు మృతి చెందాడు. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనతో నగరంలో కలకలం రేగింది.
పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు చింతలపూడికి చెందిన మేకా అనిల్ (30). కుటుంబంతో విభేదాల కారణంగా కొంతకాలంగా ఏలూరులో నివసిస్తూ తాపీ పనులు చేసేవాడు. అతనికి మద్యపానం అలవాటు ఉన్నట్లు తెలిసింది.
గురువారం ఉదయం సుమారు 10.39 గంటలకు విజయవిహార్ సెంటర్ సమీపంలోని ఎస్‌ఆర్ వైన్స్ (షాపు నంబర్ 4) కు వచ్చి, రూ.99 విలువైన రాయల్ లెన్సర్ విస్కీ బాటిల్ కొనుగోలు చేశాడు. వాటర్ ప్యాకెట్ నీరు కలిపి తాగుతున్న సమయంలో అకస్మాత్తుగా కూలబడి పడిపోయాడు.
అతడు పడిపోవడంతో షాపులోని ఇతరులు తొలుత స్పందించకపోగా, కొద్దిసేపటికి మరణించినట్లు గుర్తించారు. ఇదే సమయంలో ఒక వ్యక్తి అతడి మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాలో రికార్డయింది.
సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై డీఎస్పీ డి. శ్రావణ్‌కుమార్, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ. ఆవులయ్య స్పందిస్తూ,“కల్తీ మద్యం కారణమని అపోహపడాల్సిన అవసరం లేదు. సంబంధిత బాటిల్స్‌లో నాణ్యమైన మద్యమే ఉంది” అని స్పష్టం చేశారు.
Post a Comment