-->

గర్భవతిని చేసి అబార్షన్‌ చేయించిన హోం గార్డు – ఆర్‌ఎంపీ వైద్యురాలి అరెస్ట్‌

గర్భవతిని చేసి అబార్షన్‌ చేయించిన హోం గార్డు – ఆర్‌ఎంపీ వైద్యురాలి అరెస్ట్‌


శంషాబాద్‌ రూరల్‌, అక్టోబర్‌ 15 (ప్రతినిధి):నగర శివారులోని శంషాబాద్‌ మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్‌ నిర్వహించిన ఓ ఆర్‌ఎంపీ వైద్యురాలు, యువతిని గర్భవతిని చేసిన హోం గార్డు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన వైద్య, ఆరోగ్యశాఖ నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేసింది.

శంషాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ నరేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం — శంషాబాద్‌ మండలంలోని ముచ్చింతల్‌ గ్రామానికి చెందిన మధుసూదన్‌, స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో హోం గార్డుగా పని చేస్తున్నాడు. పారుఖ్‌నగర్‌ మండలం రాయికల్‌ గ్రామానికి చెందిన మౌనిక (29) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమవుతూ ఉండేది. గత ఏడు సంవత్సరాలుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఇటీవల మౌనిక గర్భవతిగా మారింది.

పెళ్లి కోసం మౌనిక ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో మధుసూదన్‌ “ముందుగా అబార్షన్‌ చేసుకుందాం, తర్వాత పెళ్లి చేసుకుందాం” అని ఆమెను నమ్మించాడు. ఈ నేపథ్యంలో అతడు మౌనికను శంషాబాద్‌ మండలంలోని పాలమాకుల గ్రామంలో ఉన్న ఆర్‌ఎంపీ వైద్యురాలు పద్మజా వద్దకు తీసుకెళ్లి గర్భస్రావం చేయించాడు. అయితే వైద్యురాలు అనుభవం లేకుండా చేసిన ఆపరేషన్‌ వికటించడంతో మౌనికకు తీవ్ర రక్తస్రావం ప్రారంభమైంది.

తరువాత ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించినా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటనపై మౌనిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, హోం గార్డు మధుసూదన్‌, ఆర్‌ఎంపీ వైద్యురాలు పద్మజా ఇద్దరినీ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసులు తెలిపిన ప్రకారం, యువతిని పెళ్లి వాగ్దానం చేసి మోసం చేసిన మధుసూదన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793