తెలంగాణలో కొత్త పోలీసింగ్ విధానం – డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణలో కొత్త పోలీసింగ్ విధానానికి రూపకల్పన జరుగుతోందని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. "ఇదే నా లైన్" అంటూ ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ పోలీసింగ్ వైపు రాష్ట్ర పోలీసింగ్ దిశగా నడిపిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో శుక్రవారం డీజీపీ శివధర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.
నిష్పక్షపాత పోలీసింగ్ తప్పనిసరి:
పోలీసులు ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, భయాలకు తలొగ్గకుండా “రూల్ ఆఫ్ లా” (Rule of Law) అమలు చేయాలని సూచించారు. బాధితుల పట్ల పోలీస్ స్టేషన్లలో అమర్యాదగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తనిఖీలు, కఠిన చర్యలు కొనసాగుతాయి:
పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, కేసు నమోదు నుంచి నేరస్థుడికి శిక్ష పడే వరకు ప్రతి దశలో ప్రొఫెషనల్‌గా వ్యవహరించాలని ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలపై పూర్తిగా సున్నితంగా వ్యవహరించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదాలపై ఆందోళన:
రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 800 హత్యలు, అలాగే 8 వేల రోడ్డు ప్రమాద మరణాలు చోటుచేసుకుంటున్నాయని వివరించారు. ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
డీజీపీ వ్యాఖ్యలతో కొత్త పోలీసింగ్ విధానం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Post a Comment