-->

మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రెయిన్ ఎఫెక్ట్.. నిలిచిపోయిన రైళ్లు!

మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రెయిన్ ఎఫెక్ట్.. నిలిచిపోయిన రైళ్లు!


హైదరాబాద్ / మహబూబాబాద్ : అక్టోబర్ 29 : మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురవడంతో రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో వర్షపునీరు పట్టాలపైకి చేరింది. దీంతో ట్రైన్ సర్వీసులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హైదరాబాద్ నుండి గుంటూరు వైపు వెళ్తున్న గోల్కొండ ఎక్స్ప్రెస్ డోర్నకల్ స్టేషన్ వద్దే నిలిచిపోయింది. అదే విధంగా, భువనేశ్వర్ వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ ను కూడా మహబూబాబాద్ వద్ద అధికారులు ఆపేశారు.

దీంతో కాజీపేట–విజయవాడ రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ఇతర రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్లను సురక్షితంగా నడిపేందుకు రైల్వే అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

ఇక మరోవైపు, కురుస్తున్న వర్షం కారణంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు అధికారులు తాత్కాలికంగా సెలవు ప్రకటించారు. రైతులు, వ్యాపారులు మార్కెట్‌కు రాకూడదని అధికారులు సూచించారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, మొంథా తుఫాన్ ప్రభావం ఇంకా 24 గంటలపాటు కొనసాగుతుందని, తూర్పు, దక్షిణ జిల్లాల్లో తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793