ఐపీఎస్ అధికారి ఇంట్లో కోట్ల నగదు, బంగారం స్వాధీనం
లంచాలు డిమాండ్ చేసిన కేసులో సీబీఐ సీనియర్ అధికారి అరెస్ట్
పంజాబ్ రాష్ట్రంలో భారీ అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రూప్‌నగర్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (DIG) హర్చరణ్ సింగ్ భుల్లర్ (2009 బ్యాచ్ ఐపీఎస్)ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్ట్ చేసింది. లంచం కేసు విచారణలో అధికారులు రూ.5 కోట్లకు పైగా నగదు, బంగారం, లగ్జరీ వాహనాలు, హై ఎండ్ వాచ్‌లు వంటి భారీ అక్రమాస్తులను స్వాధీనం చేసుకున్నారు.
సీబీఐ ప్రకారం, భుల్లర్ తన మధ్యవర్తి కృష్ణ ద్వారా లంచాలు తీసుకుంటూ వ్యాపారవేత్తల కేసులను ‘సెటిల్’ చేయడమని ఆరోపించింది. ఈ కేసు ఆకాశ్ బట్టా అనే స్క్రాప్ డీలర్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
లంచం కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు
చండీగఢ్‌లో ప్లాన్ చేసిన ఆపరేషన్‌లో ఫిర్యాదుదారు నుండి రూ.8 లక్షలు తీసుకుంటుండగా మధ్యవర్తి కృష్ణను సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం డబ్బు స్వీకరణపై భుల్లర్ అంగీకరించినట్లు కాల్ రికార్డింగ్స్ కూడా లభించాయి.
సోదాల్లో బయటపడ్డ భారీ సంపద
అరెస్టు అనంతరం భుల్లర్‌కు చెందిన మొహాలీ, రూప్‌నగర్, చండీగఢ్ ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో రూ.5 కోట్ల నగదు, 1.5 కిలోల బంగారం, మెర్సిడెస్, ఆడి కార్లు, 22 లగ్జరీ వాచ్‌లు, ఆయుధాలు, విదేశీ మద్యం బాటిళ్లు, లాకర్ కీలు, స్థిరాస్తి పత్రాలు స్వాధీనం చేశారు. మధ్యవర్తి కృష్ణ ఇంటి నుండి మరో రూ.21 లక్షలు దొరికాయి.
దర్యాప్తు కొనసాగుతోంది
భుల్లర్, కృష్ణలను కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. మనీ లాండరింగ్ లింకులు, అక్రమాస్తుల మూలాలు తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది.
నేపథ్యం
భుల్లర్ గతంలో పాటియాలా రేంజ్ డీఐజీ, విజిలెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్, మొహాలీ, సంగ్రూర్, ఖన్నా జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. 2021లో శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్ సింగ్ మజితియా డ్రగ్ కేసు దర్యాప్తు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)కు ఆయన నాయకత్వం వహించారు.

Post a Comment