140 మంది మావోయిస్టులు రేపు లొంగుబాటు.. శాంతి దిశగా దండకారణ్యం
బీజాపూర్, అక్టోబర్ 16: మావోయిస్టు లొంగుబాట్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ స్థాయిలో మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోనున్నారు. కేంద్ర కమిటీ సీనియర్ నేతలు రూపేష్, రనిత నేతృత్వంలో 140 మంది మావోయిస్టులు రేపు (శుక్రవారం, అక్టోబర్ 17) జగదల్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్, హోం మంత్రి విజయ్ శర్మ సమక్షంలో లొంగిపోనున్నారు.
ఇందులో కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్, మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత, ఇద్దరు DKSZC సభ్యులు, 15 మంది DVC సభ్యులు ఉన్నారు. వీరంతా కలిపి 140 మంది మావోయిస్టులు భైరామ్‌గఢ్ వైపు బయల్దేరినట్లు సమాచారం. ఇంద్రావతి నది దాటి జగదల్‌పూర్‌కు చేరుకునే ప్రయత్నంలో ఉన్న ఈ బృందం వద్ద 70కి పైగా ఆయుధాలు ఉన్నాయని భద్రతా వర్గాలు వెల్లడించాయి. భైరామ్‌గఢ్ నుండి ఉస్పారి ఘాట్ వరకు భద్రతా దళాలు గట్టి భద్రతను మోహరించగా, ఆ మార్గంలో సాధారణ ప్రజలకు రాకపోకలు నిలిపివేశారు.
ఇదే సమయంలో మహారాష్ట్రలో కూడా లొంగుబాట్ల పరంపర కొనసాగుతోంది. అక్కడ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట బుధవారం లొంగిపోగా, అతని వెంట మరో అగ్రనేత తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న కూడా లొంగిపోయారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటెన్సివ్ ఆపరేషన్‌లు, భద్రతా దళాల దిగ్బంధన చర్యలు, ప్రజల సహకారం వల్ల మావోయిస్టుల శక్తి దెబ్బతింటోంది. చర్చల ద్వారా మార్గం కనుగొనలేక, తాము నమ్మిన ఆయుధాలు వదిలి ప్రజా జీవితంలోకి చేరాలని వందల మంది మావోయిస్టులు నిర్ణయించుకున్నారు. గత రెండు రోజుల్లో అగ్రనేతలతో కలిపి 283 మంది మావోయిస్టులు లొంగుబాటుకు సిద్ధం కావడం భద్రతా వ్యవస్థల విజయంగా భావిస్తున్నారు.
Post a Comment