గూగుల్ మ్యాప్‌లో ఆర్టీసీ బస్సులు!“వేర్ ఇస్ మై బస్?” ఇక గూగుల్ చెప్పేస్తుంది
హైదరాబాద్ : అక్టోబర్ 07: తెలంగాణలో ప్రయాణికులకు మరో సదుపాయం అందుబాటులోకి రానుంది. త్వరలోనే గూగుల్ మ్యాప్‌లో ఆర్టీసీ బస్సుల రాకపోకల సమాచారం లైవ్‌గా కనిపించనుంది. ఈ ప్రాజెక్ట్‌పై గూగుల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించింది.
గూగుల్ ప్రతినిధి ఒకరు ఇటీవల టీఎస్‌ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి బస్సుల లైవ్ డేటా షేర్ చేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు ఐటీ శాఖ కూడా ఆర్టీసీకి లేఖ రాసింది. ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో, ఈ సేవ త్వరలో ప్రారంభం కానుంది.
గమ్యం యాప్ తర్వాత గూగుల్ మ్యాప్ సదుపాయం
ప్రస్తుతం ఆర్టీసీ ‘గమ్యం’ యాప్ ద్వారా బస్సు బయలుదేరిన సమయం, మార్గం, స్టాప్ వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. అయితే కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో, మరింత కచ్చితత్వం కోసం గూగుల్ మ్యాప్ సహకారంతో ఈ వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించారు.
దీపావళికల్లా సిటీ బస్సులు గూగుల్‌లో!
‘మీ టికెట్’ యాప్‌లో కొత్త సదుపాయాలు
రాష్ట్ర ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ విభాగం నిర్వహిస్తున్న ‘మీ టికెట్’ యాప్ ద్వారా త్వరలో ఇంటర్‌సిటీ బస్సు సేవలు, క్యూఆర్ ఆధారిత డిజిటల్ బస్ పాస్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి.
ఇకపై బస్సు టికెట్లు, నెలవారీ పాస్‌లు అన్నీ ‘మీ టికెట్’ యాప్ ద్వారానే పొందొచ్చు. క్యూఆర్ కోడ్ బస్సు టికెట్లు, డిజిటల్ పాస్ సేవల ప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామని టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Post a Comment