-->

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు తప్పదు: సీపీ సజ్జనార్

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు తప్పదు: సీపీ సజ్జనార్


హైదరాబాద్: అక్టోబర్ 07: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సోమవారం మాదన్నపేట్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ వ్యవస్థ పనితీరు, పెండింగ్ కేసుల పరిష్కారం, నేరాల పరిశీలన వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

తనిఖీ సందర్భంగా స్టేషన్ రికార్డులు, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు, పెండింగ్ కేసులు, క్రైమ్ వివరాలను స్వయంగా పరిశీలించిన సీపీ, బాధితులకు న్యాయం జరిగేలా అన్ని కేసులను వేగంగా పూర్తిచేయాలని సూచించారు.

పోలీసింగ్ అంటే కేవలం చట్టాన్ని అమలు చేయడమే కాకుండా ప్రజల్లో నమ్మకం పెంపొందించేలా వ్యవహరించడమని సజ్జనార్ పేర్కొన్నారు. పారదర్శకత, క్రమశిక్షణ, సత్సంబంధాలు పోలీసుల ప్రతిష్ఠను మరింత పెంచుతాయని ఆయన స్పష్టం చేశారు.

సుదీర్ఘ విరామం తర్వాత యూనిఫారంలో తిరిగి బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్, ఇటీవల హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించి తన ప్రత్యేకమైన శైలిలో వ్యవహరిస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న ఆయన, తాజా హెచ్చరికను డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసులపై జారీ చేశారు.

“మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై ఎలాంటి కనికరం చూపం. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే జైలులో ఊచలు లెక్కపెట్టాల్సిందే,” అని సజ్జనార్ స్పష్టం చేశారు. గత నాలుగేళ్లుగా టీఎస్ఆర్టీసీ ఎండీగా పనిచేసిన ఆయన, ఇప్పుడు సీపీగా కఠినమైన చట్ట అమలు వైపు దృష్టి సారించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793