ఆటోలోనే నిండు గర్భిణీకి ప్రసవం — సకాలంలో సహాయం అందించిన ఆశా కార్యకర్తలు!
జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల గ్రామం సమీపంలో ఆదివారం ఉదయం హృదయాన్ని హత్తుకునే సంఘటన చోటుచేసుకుంది. అంబులెన్స్ ఆలస్యం కావడంతో ఆస్పత్రికి ఆటోలో ప్రయాణిస్తున్న ఒక గర్భిణీ స్త్రీ రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది.
వివరాల్లోకి వెళ్తే — లింగాలఘనపురం మండలానికి చెందిన కనకలక్ష్మి అనే నిండు గర్భిణీకి ఉదయం సమయంలో ప్రసవ వేదనలు మొదలయ్యాయి. అంబులెన్స్ రాక ఆలస్యం కావడంతో, అదే గ్రామానికి చెందిన శ్రీశైలం అనే ఆటోడ్రైవర్ సహాయంగా ముందుకు వచ్చి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.
ఆటో నెల్లుట్ల గ్రామం వద్దకు రాగానే, గర్భిణీకి పురిటినొప్పులు తీవ్రం కావడంతో పరిస్థితి అత్యవసరంగా మారింది. వెంటనే ఆటోడ్రైవర్ శ్రీశైలం సమీపంలోని ఆశా కార్యకర్తలు అరుణ, పుష్ప, ఉమలకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు.
అతి తక్కువ సమయంలో అక్కడికి చేరుకున్న ఆశా కార్యకర్తలు రోడ్డుపైనే అవసరమైన ఏర్పాట్లు చేసి, ధైర్యంగా ముందుకొచ్చి గర్భిణీకి ప్రసవం జరిపారు. ఈ సందర్భంగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కనకలక్ష్మి, తల్లి, బిడ్డ ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రసవం అనంతరం తల్లి, బిడ్డను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో సహాయం అందించిన ఆశా కార్యకర్తలు అరుణ, పుష్ప, ఉమ, అలాగే మానవత్వం చూపిన ఆటోడ్రైవర్ శ్రీశైలాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ప్రశంసలతో ముంచెత్తారు.
స్థానికులు మాట్లాడుతూ, “ఇలాంటి సేవామూర్తులు సమాజానికి ఆదర్శం” అని అభినందించారు.
Post a Comment