మావోయిస్టు అనుబంధ నేత బండి ప్రకాష్ లొంగుబాటు!
హైదరాబాద్ : అక్టోబర్ 28: నిషేధిత మావోయిస్టు అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) కార్యదర్శిగా పనిచేసిన బండి ప్రకాష్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఆయన మంగళవారం అధికారికంగా ఆత్మసమర్పణ చేశారు.
మంచిర్యాల జిల్లా మందమర్రికు చెందిన బండి రామారావు – అమృతమ్మ దంపతుల రెండో కుమారుడు ప్రకాష్, 1982–84 మధ్య కాలంలో అప్పటి పీపుల్స్ వార్ అనుబంధ విద్యార్థి విభాగం “రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU)” కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అనంతరం సింగరేణి కార్మికుల కోసం ఏర్పాటైన సికాసలో మిలిటెంట్‌గా పనిచేశారు.
1984 నవంబరులో మందమర్రి ఏఐటీయూసీ నాయకుడు వీటీ అబ్రహం హత్య కేసులో అరెస్టయిన ఆయన కొంతకాలం జైలు జీవితం గడిపారు. తరువాత వరంగల్ జైలు నుంచి ఆదిలాబాద్ సబ్‌జైలుకు తరలించగా, పీపుల్స్ వార్ నాయకులు నల్లా అదిరెడ్డి, హుస్సేన్, ముంజం రత్నయ్యతో కలిసి జైలు నుంచి తప్పించుకున్నారు.
కొంతకాలం తరువాత బయటకు వచ్చి హేమను వివాహం చేసుకుని సాధారణ జీవితం ప్రారంభించిన ప్రకాశ్, తిరిగి హైదరాబాద్‌లో అరెస్టు అయ్యారు. చర్లపల్లి జైలులో ఉన్నప్పుడు పీపుల్స్ వార్ అగ్రనేత శాకమూరి అప్పారావుతో పరిచయం ఏర్పడటంతో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
తరువాత మావోయిస్టు పార్టీ సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) పునరుద్ధరణ బాధ్యతలను ఆయనకు అప్పగించింది. అనేక కార్మిక పోరాటాలకు ఆయన నాయకత్వం వహించారు. మాజీ సీఎం డా. వైఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో మావోయిస్టులతో శాంతిచర్చల నేపథ్యంలో ఆసిఫాబాద్ సమీపంలోని మోవాడ్‌లో జరిగిన భారీ బహిరంగ సభకు ప్రకాశ్ అధ్యక్షత వహించారు.
అయితే, చర్చలు విఫలమైన తర్వాత మళ్లీ అజ్ఞాత జీవితం ప్రారంభించారు. ఇటీవలి కాలంలో వయసు మీదపడటంతో పాటు షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఆయనపై రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది.

Post a Comment