-->

నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను కాపాడిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది

నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను కాపాడిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది


మెదక్ జిల్లా, ఏడుపాయలు: అప్రమత్తతతో ప్రాణాపాయంలో ఉన్న ఇద్దరు యువకులను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడిన ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వద్ద శనివారం చోటుచేసుకుంది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం — హైదరాబాద్‌ కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన 20మంది యువకులు అమ్మవారి విగ్రహ నిమజ్జనం కోసం ఏడుపాయలకు వచ్చారు. ఆలయం సమీపంలోని చెక్‌డ్యాం అవతలి వైపున విగ్రహ నిమజ్జనం పూర్తయ్యాక వినయ్‌, సాయి అనే ఇద్దరు యువకులు స్నానం చేయడానికి నదిలోకి దిగారు. ఈ సమయంలో వినయ్‌ కాలు జారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోగా, అతన్ని కాపాడేందుకు సాయి ముందుకు వెళ్లాడు. ఇద్దరూ ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయి, నదీ మధ్యలో ఉన్న చెట్లను పట్టుకొని సహాయం కోసం అరిచారు.

ఈ దృశ్యాన్ని గమనించిన తోటి స్నేహితులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ క్యూఆర్టీ బృందంతో అక్కడికి చేరుకొని రక్షణ చర్యలు ప్రారంభించారు. అనంతరం డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ జార్జి, అగ్నిమాపక అధికారి వెంకటేష్‌ బృందంతో కలిసి తాడు సాయంతో నదిలోకి దిగి ఇద్దరినీ సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.

తరువాత వారిని వారి స్నేహితులు, కుటుంబ సభ్యుల చెంతకు అప్పగించారు. ప్రాణాపాయంలో ఉన్న యువకులను కాపాడిన పోలీసు, అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు, యువకుల స్నేహితులు హర్షాతిరేకాలతో అభినందించారు.

ఈ సందర్భంగా మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, “నీటి ప్రవాహాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిమజ్జనాల సందర్భంగా నది ప్రవాహం వైపు వెళ్లరాదు. పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి,” అని సూచించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793