స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ స్థానిక అభ్యర్థులుగా వారికే ఛాన్స్, కీలక నిర్ణయం..!
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ బిగ్ ప్లాన్ సిద్ధం చేసింది. అధికారంలో ఉండటంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, ముందుగానే వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లు తమకు కలిసివస్తాయని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
అటు బీఆర్ఎస్ ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌లకు స్థానిక ఎన్నికల బాధ్యతలు కేటాయించగా, బీజేపీ ఈసారి తామూ బలంగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల ఎంపికపై ముందుగానే దృష్టి సారించింది.
సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటూ, షెడ్యూల్ వెలువడకముందే పార్టీ స్థాయిలో సన్నాహాలు పూర్తి చేశారు. అక్టోబర్ 9న నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో, రేపు (ఆదివారం) సాయంత్రం లోపల ప్రతి స్థానానికి ముగ్గురు అభ్యర్థుల సిఫారసు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
దీంతో జిల్లాల ఇంచార్జ్ మంత్రులు వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లతో చర్చలు జరుపుతున్నారు. సామాజిక సమీకరణాలు, రిజర్వేషన్ల ఆధారంగా ప్రతి స్థానానికి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.
ఇక జెడ్‌పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ కమిటీకి అప్పగించారు. సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఆయా జిల్లా కాంగ్రెస్ కమిటీలకు (డీసీసీ) అప్పగించారు.
అలాగే, పార్టీ మార్చిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను సెక్రటరీలకు అప్పగించారు రేవంత్‌రెడ్డి.
టీపీసీసీ ఈనెల 8వ తేదీన అన్ని స్థానాలకు అభ్యర్థుల జాబితా ప్రకటించాలని నిర్ణయించింది. ఇక కోర్టు బీసీ రిజర్వేషన్లపై అక్టోబర్ 9న ఇచ్చే తీర్పు తర్వాత బీఆర్ఎస్, బీజేపీలు తమ వ్యూహాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.
కాంగ్రెస్ మాత్రం తీర్పు సమయానికే అభ్యర్థుల ఖరారు చేసి, పూర్తి స్థాయిలో ఎన్నికల మైదానంలోకి దూకేందుకు సన్నద్ధమవుతోంది.
ఈ నిర్ణయాలు పార్టీకి ఎంతవరకు లాభపడతాయో రాబోయే రోజుల్లో తేలనుంది.
Post a Comment