వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హతమార్చిన భార్య
తలపై కర్రతో కొట్టి, శవాన్ని బాత్రూమ్‌లో పడేసి ప్రమాదవశాత్తు మరణించినట్లు నాటకం
హైదరాబాద్, అక్టోబర్ 27: రాక్షసి మానసికతతో భర్తను హతమార్చిన భార్య హేయకృత్యం వెలుగులోకి వచ్చింది. మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ ప్రగతి నగర్ కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
అల్లంపల్లి విజయ్‌కుమార్ (42) ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అతని భార్య సంధ్య మున్సిపల్ శాఖలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో సంధ్య తన సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో, దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
ఇటీవల విజయ్ కుమార్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఆ సహోద్యోగిని హెచ్చరించడంతో, భర్తను అడ్డుగా భావించిన సంధ్య భయంకర నిర్ణయం తీసుకుంది.
ఒక రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో విజయ్ కుమార్ మెడకు తాడు చుట్టి ఉక్కిరిబిక్కిరి చేసి చంపేసింది. అనంతరం కర్రతో తలపై కొట్టి, మృతదేహాన్ని బాత్రూమ్ వద్ద పడేసి, అతను ప్రమాదవశాత్తు జారి పడిపోయి మరణించినట్లు నాటకం ఆడింది.
అంత్యక్రియల ఏర్పాట్ల సమయంలో ఇంట్లో తాడుపై రక్తం గమనించిన మృతుడి తల్లి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు కేసు నమోదు చేసి, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా విచారణ జరిపి సంధ్యను అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నించగా తానే భర్తను హతమార్చినట్లు ఆమె ఒప్పుకుంది. మీర్‌పేట్ పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment