రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గు మందు ఇవ్వొద్దు: తెలంగాణ వైద్యశాఖ హెచ్చరిక
హైదరాబాద్, అక్టోబర్ 07: రెండేళ్లలోపు పిల్లలకు దగ్గు మందులు ప్రమాదకరమని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తల్లిదండ్రులు, వైద్యులకు హెచ్చరిక జారీ చేసింది. చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం చూపే విధంగా సిరప్‌లను నిర్లక్ష్యంగా వాడకూడదని సూచించింది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) మార్గదర్శకాల ప్రకారం,
- రెండేళ్లలోపు బాలలకు దగ్గు మందు ఇవ్వొద్దు.
- ఐదేళ్లలోపు పిల్లలకు కూడా సాధారణంగా సిరప్‌లు వాడకూడదు.
- ఐదేళ్లు దాటిన పిల్లలకు మాత్రమే వైద్యుల పర్యవేక్షణలో, సరైన మోతాదులో, తక్కువ కాలం పాటు సిరప్‌లు వాడాలని సూచించింది.
అదేవిధంగా, ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్పత్రులు నాణ్యమైన తయారీ ప్రమాణాలు కలిగిన మందులనే వినియోగించాలి అని ఆదేశించింది.
కోల్డ్రిఫ్ సిరప్‌పై నిషేధం
వైద్యశాఖ తాజాగా 2025 మే నుండి 2027 ఏప్రిల్ వరకు గడువు గల ఎస్‌ఆర్-13 బ్యాచ్ కోల్డ్రిఫ్ సిరప్‌ను వాడరాదని హెచ్చరించింది. తమిళనాడులోని స్రేసన్ ఫార్మా కంపెనీ తయారు చేసిన ఈ సిరప్‌ను వెంటనే సమీప ఔషధ నియంత్రణ అధికారులకు అప్పగించాలి అని తెలిపింది.
సంబంధిత ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్: 1800-599-6969 అందుబాటులో ఉంచింది.
అమలు పర్యవేక్షణ
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రులు ఈ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని డీఎంహెచ్‌వోలను ఆదేశించింది. అలాగే ప్రజల్లో దగ్గు మందుల వాడకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అని తెలిపింది.
Post a Comment