ఆర్టీసీ చార్జీల పెంపుపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర అసహనం వ్యక్తం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) బస్సుల్లో చార్జీల పెంపుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “బస్సు ఎక్కడమే పాపమా? సామాన్య ప్రజలంటే ఎందుకింత కోపం ముఖ్యమంత్రి గారు?” అంటూ ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా ప్రశ్నించారు.
ఇటీవలే సిటీ బస్ పాస్‌ల ధరలు భారీగా పెంచి, చిరుద్యోగులు మరియు నగర ప్రజలపై పెనుభారం మోపారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ టికెట్ చార్జీలను పెంచడం ప్రజలపై మరింత భారమని కవిత మండిపడ్డారు. “బస్సు ఎక్కడమే పాపం అన్నట్టుగా ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారు. ‘గ్రీన్ జర్నీ’ పేరుతో సామాన్యుల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ పెంపుతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆర్డినరీ, మెట్రో, సిటీ బస్సులకు స్టేజీల వారీగా రూ.5 నుంచి రూ.10 వరకు టికెట్ ధరలు పెరిగాయి. కొత్త ధరలు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి.
తాజా మార్పులతో సిటీ ఆర్డినరీ బస్సుల్లో కనీస టికెట్ ధర రూ.15గా నిర్ణయించబడింది. దీంతో రోజువారీగా బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాల్సిన సమయములో చార్జీల పెంపు ప్రజా వ్యతిరేక నిర్ణయమని కవిత వ్యాఖ్యానించారు.
Post a Comment