12న మెగా జాబ్ మేళా – యువత సద్వినియోగం చేసుకోవాలి
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొననున్నారు – ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచన
కొత్తగూడెం, నవంబర్ 7: కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. సింగరేణి కాలరీస్ సంస్థ సౌజన్యంతో ఈ నెల 12న కొత్తగూడెం క్లబ్ ప్రాంగణంలో మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
గురువారం కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, ఈ జాబ్ మేళా యువతకు ఉద్యోగావకాశాల పంటని పండించబోతోందన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ మేళాకు 50కి పైగా ప్రతిష్ఠాత్మక కంపెనీలు హాజరుకానున్నాయని తెలిపారు.
“జిల్లా నలుమూలల నుండి కనీసం 10 వేల మందికి పైగా యువత హాజరయ్యేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ప్రచారం నిర్వహించాలి. మూడు వేలకుపైగా ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా మేళా నిర్వహణ జరుగుతోంది. నిరుద్యోగుల జీవితాల్లో మార్పు తీసుకురాగల ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాలి,” అని ఎమ్మెల్యే అన్నారు.
10వ తరగతి పాస్ అయిన వారు మొదలుకుని ఐటీఐ, డిప్లొమా, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ, పోస్ట్‌గ్రాడ్యుయేషన్, బీటెక్, ఎంటెక్ తదితర అర్హతలున్న అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. రూ.13 వేల నుంచి రూ.10 లక్షల వరకు జీతప్యాకేజీలు ఉండే ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
జాబ్ మేళాకు హాజరయ్యేందుకు అభ్యర్థులు ముందుగా QR కోడ్ ద్వారా ఆన్లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అయితే, రిజిస్ట్రేషన్ చేయలేని వారు నేరుగా వచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఒక్కొక్కరు కనీసం ఐదు కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరయ్యే విధంగా టోకెన్ పాస్ సిస్టమ్ అమలు చేయనున్నట్టు తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులకు ఆ కంపెనీలు అక్కడికక్కడే నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి 40 ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ప్రచార బృందాలుగా పనిచేస్తున్నారని తెలిపారు.

Post a Comment