50 శాతం రిజర్వేషన్లతో ‘లోకల్ ఫైట్’.. వచ్చే నెలలోనే ముహూర్తం!
హైదరాబాద్: వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగవంతం చేసింది.
కేబినెట్ భేటీ 12న
ఇందులో భాగంగా ఈ నెల 12న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసింది. హైకోర్టు సూచించిన విధంగా 50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం అధికారిక నిర్ణయం తీసుకోనుందని సమాచారం.
హైకోర్టు ఇప్పటికే రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించినా, అక్కడ నుండి అనుకూలత లభించలేదు. “ఇది హైకోర్టు పరిధిలోని విషయం” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంతో ప్రభుత్వం వేరే మార్గం లేకుండా పోయింది. దీంతో 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు తప్పనిసరిగా మారాయి.
ఎన్నికల సంఘం ఎదురు చూపు
రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు ఆదేశాలను పాటించడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కానీ, అంతకు ముందే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వం వద్దకు లేఖ రాసి — కోర్టు సూచనల ప్రకారం రిజర్వేషన్‌ల జాబితా అందించాలని కోరింది. అయితే ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు. అందువల్ల ఎన్నికల కమిషన్ ప్రభుత్వం నిర్ణయాన్ని ఎదురు చూస్తోంది.
నెలాఖరులోగా షెడ్యూల్ విడుదల
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసిన వెంటనే కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం, పాత విధానంలో (50% రిజర్వేషన్లు) ఎన్నికలు నిర్వహించడానికి మొగ్గు చూపుతోంది.
కేబినెట్ నిర్ణయం అనంతరం పంచాయతీరాజ్ శాఖ కలెక్టర్ల ద్వారా రిజర్వేషన్ల తుది జాబితా ఖరారు చేయనుంది. ఆ తర్వాత ఆ జాబితాను ఎన్నికల సంఘానికి అందిస్తారు.
ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, రిజర్వేషన్లు ఖరారయ్యగానే ఈ నెలాఖరులోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
డిసెంబర్‌లోనే ఎన్నికల సూచన
ప్రస్తుతం ప్రభుత్వ అంచనా ప్రకారం, వచ్చే నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక ఎన్నికలు ఆలస్యం చేయడం సరికాదని ప్రభుత్వం భావిస్తోంది.
పార్టీ కేడర్ నుంచి ఒత్తిడి, కేంద్ర నిధుల అంశం వంటి కారణాలతోనూ ఎన్నికల వేళ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశం ఉందని తెలుస్తోంది. చట్టపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాకుంటే, పార్టీ స్థాయిలో అమలు చేస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది.

Post a Comment