ఆర్టీసీ బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం డీసీఎం లారీ అదుపు తప్పి బస్సును ఢీ
హైదరాబాద్, నవంబర్ 7: వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. చేవెళ్ల వద్ద జరిగిన బస్సు–టిప్పర్ ప్రమాదం మిగిల్చిన విషాదం మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది. ఈసారి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో ప్రమాదం సంభవించింది.
శుక్రవారం ఉదయం హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారిపై ఆరాంఘర్ కూడలి వద్ద ఆర్టీసీ బస్సును ఒక డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
స్థానికుల సమాచారం ప్రకారం — షాద్‌నగర్ డిపోకు చెందిన టీఎస్07యుఎం-0713 నంబరు గల బస్సు ఉదయం ఆరాంఘర్ చేరుకుంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన బస్సును గ్రీన్ సిగ్నల్ పడగానే డ్రైవర్ ముందుకు నడిపించాడు. అదే సమయంలో వెనుకవైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన కేఎ29సి-2138 నంబరు గల డీసీఎం లారీ అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది.
సమయానికి బస్సు వేగంగా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా ఢీ కొట్టడంతో బస్సులో హహాకారాలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు ప్రయాణికులను రక్షితంగా కిందకు దింపారు. కొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
ఆస్పత్రి వర్గాలు ప్రయాణికుల పరిస్థితి ప్రమాదకరంగా లేదని వెల్లడించాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Post a Comment