వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు! సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ
హైదరాబాద్, నవంబర్ 7: దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, క్రీడా సముదాయాలు, బస్ డిపోలు, రైల్వే స్టేషన్ల పరిధిలో ఉన్న అన్ని వీధి కుక్కలను వెంటనే తరలించాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.
అటువంటి ప్రాంగణాల్లో ఉన్న కుక్కలను పట్టుకుని శస్త్రచికిత్స చేయించి, వ్యాక్సిన్ వేయాలని కోర్టు ఆదేశించింది. అయితే, శస్త్రచికిత్స తర్వాత వాటిని తిరిగి అదే ప్రదేశాల్లో విడిచిపెట్టరాదని స్పష్టం చేసింది. అలా చేస్తే కోర్టు ఉద్దేశ్యం నిర్వర్థకమవుతుందని వ్యాఖ్యానించింది.
ప్రజా భద్రతకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని, వీధి కుక్కలను సరైన షెల్టర్లకు తరలించాలని సూచించింది.
ఈ విచారణను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ నిర్వహించింది. వీధి కుక్కల కాట్ల ఘటనలపై వచ్చిన పిటిషన్లను పరిశీలించిన అనంతరం ఈ తాత్కాలిక ఆదేశాలు జారీ అయ్యాయి. పూర్తి తీర్పు త్వరలో వెలువడనుంది.
అంతేకాక, స్థానిక మున్సిపల్ సంస్థలు, పంచాయతీలు మూడు నెలలపాటు తనిఖీలు జరిపి నివేదిక ఇవ్వాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Post a Comment