కేవలం ₹500 కోసం స్నేహితుడినే హతమార్చిన స్నేహితులు
కోవూరు, నెల్లూరు జిల్లా: అప్పుల వివాదం–మద్యం మత్తు కలిసినప్పుడు ఎంత భయంకర పరిణామాలు చోటు చేసుకుంటాయో కోవూరు పట్టణం వెలుపల జరిగిన ఈ ఘోర ఘటన మరోసారి నిరూపించింది. వేగురు కాలువ ప్రాంతానికి చెందిన రాజా, షాజహాన్ స్నేహితులు. ఇటీవల షాజహాన్, రాజా వద్ద అవసరానికి ₹500 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అయితే అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి.
గత నెల 25న రాజాతో పాటు మస్తాన్, సుబ్బయ్య, పెంచలయ్య కలిసి మద్యం సేవించిన షాజహాన్… ఆ సమయంలో రాజా ₹500 బాకీపై ప్రశ్నించగా వాగ్వాదం నెలకొంది. మద్యం మత్తులో ఆగ్రహించిన రాజా, అతని స్నేహితులతో కలిసి షాజహాన్‌పై తీవ్ర దాడి చేశారు. గాయాలయ్యడంతో షాజహాన్‌ను ఆసుపత్రికి చేర్చినప్పటికీ, తిరుగు ప్రయాణంలో మరోసారి చితకబాదారు. ఈసారి దాడి తీవ్రతకు షాజహాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
సాక్ష్యాలను దాచేందుకు షాజహాన్ మృతదేహాన్ని వేగురు కాలువలో పడవేసి పరారయ్యారు. తెల్లవారేసరికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై కోవూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి 24 గంటల్లోనే మృతదేహాన్ని గుర్తించారు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి… కేవలం ₹500 రూపాయల అప్పు వివాదమే హత్యకు కారణమని నిర్ధారించారు.
ఈ కేసులో రాజా, మస్తాన్, సుబ్బయ్య, పెంచలయ్యలను అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపర్చినట్లు కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు.

Post a Comment