-->

భయంకర ఘటన.. తల నరికేసి, చేతి వేళ్లు కట్ చేసి మహిళ హత్య

భయంకర ఘటన.. తల నరికేసి, చేతి వేళ్లు కట్ చేసి మహిళ హత్య


నిజామాబాద్, నవంబర్ 1 : నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మిట్టాపూర్ శివారులో ఒక భయానక ఘటన వెలుగుచూసింది. బాసర ప్రధాన రహదారి పక్కన ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి దృశ్యం చూసినవారంతా షాక్‌కు గురయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హత్య అత్యంత కిరాతకంగా జరిగింది. మహిళ తల పూర్తిగా నరికివేయబడి ఉండగా, చేతుల వేళ్లు సగం వరకు తెగిపోయినట్లు తెలిపారు. మృతురాలి వయసు 30 నుండి 40 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా. శరీరం వివస్త్రంగా ఉండటంతో హత్యకు ముందు అత్యాచారం జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంఘటనా స్థలాన్ని నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. క్లూస్‌ టీం హంతకుల వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించింది. ప్రాథమిక విచారణలో మహిళను మరో ప్రాంతంలో హత్య చేసి, ఆధారాలు దొరకకుండా ఉండేందుకు మృతదేహాన్ని రాత్రివేళ మిట్టాపూర్ శివారులో పడేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

తలను నరికివేయడం, వేళ్లను కట్ చేయడం వంటి చర్యలు మహిళ గుర్తింపును చెరిపివేయాలన్న హంతకుల ప్రయత్నమని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన వెనుక వ్యక్తిగత కక్షలు లేదా తీవ్రమైన వైషమ్యాలు ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. నవీపేట పోలీసులు కేసు నమోదు చేసి, జిల్లాలోని మరియు పొరుగు జిల్లాల మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నారు. హతురాలిని గుర్తించడానికి, నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దించబడ్డాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793