బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవపై నిషేధాజ్ఞలు కొనసాగింపు
అనుమతి లేని డ్రోన్‌లు, డీజే సౌండ్స్‌పై కఠిన చర్యలు : సీపీ అంబర్ కిషోర్ ఝా
రామగుండం : సాధారణ పౌరులు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను మరొక నెలపాటు పొడిగిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
మద్యం సేవించి రోడ్లపై అసభ్య పదజాలం ఉపయోగించడం, ఇతరులపై దౌర్జన్య ప్రవర్తన చేయడం వంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల భద్రత, సౌకర్యం కోసం నిషేధం తప్పనిసరని తెలిపారు.
డీజే, డ్రోన్ వినియోగంపై కూడా నిషేధం కొనసాగింపు
రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్‌లలో డీజే సౌండ్స్ వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాన్ని పొడిగించినట్లు సీపీ తెలిపారు.
వృద్ధులు, చిన్నపిల్లలు, విద్యార్థులు, రోగులు శబ్ద కాలుష్యం వల్ల ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
వివిధ కార్యక్రమాల సందర్భాల్లో డీజే వినియోగం కఠినంగా నిషేధించబడింది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో మైక్‌సెట్ వినియోగించాలనుకుంటే సంబంధిత డివిజన్ ఏసీపీ అనుమతి తీసుకోవాలని సూచించారు.
ఈ నిషేధాజ్ఞలు కూడా 01-11-2025 నుండి 01-12-2025 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.
సిటీ పోలీస్ యాక్ట్ అమలు
ఈ కాలంలో ఎటువంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. అటువంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు.
అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించే వారు, బంద్ పేరుతో సంస్థలు లేదా కార్యాలయాలను బలవంతంగా మూసివేయించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న కృషికి ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కోరారు.

Post a Comment