పెరుగుతున్న చలి, పడిపోతున్న ఉష్ణోగ్రతలు – బీ అలర్ట్!
హైదరాబాద్, నవంబర్ 8: తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం రాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ప్రస్తుతం మరింతగా పడిపోయాయి. ఇకపై ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్‌లో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
రాత్రిపూట చలిగాలుల తీవ్రత గణనీయంగా పెరిగింది. చాలాచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చలి మరింతగా పెరుగుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే వారం రోజుల్లో వాయవ్య, మధ్య భారత దేశ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండే అవకాశం ఉంది.
వచ్చే 48 గంటల్లో సెంట్రల్, వెస్ట్ ఇండియాలో 2–3 డిగ్రీలు, ఈస్ట్ ఇండియాలో వచ్చే 3 రోజుల్లో 3–4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పడిపోవచ్చని అంచనా వేయబడింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా బేలలో శుక్రవారం అత్యల్పంగా 14.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో చలి తీవ్రత అధికమై ప్రజలు వణికిపోతున్నారు. రాత్రివేళల్లో బయటకు వెళ్లేందుకు జనాలు జంకుతున్నారు.
జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ఈ నెల 9న మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వాతావరణ శాఖ ప్రజలకు సూచిస్తూ – ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గుండె మరియు శ్వాస సంబంధ సమస్యలతో బాధపడేవారు రాత్రివేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించింది. రాబోయే రోజుల్లో పలు ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు, పొగమంచు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Post a Comment