-->

పత్తి రైతుపై మరో పిడుగు… కేంద్ర రూల్స్‌కు నిరసనగా ఇవాళ్టి నుంచి జిన్నింగ్ మిల్లుల బంద్

పత్తి రైతుపై మరో పిడుగు… కేంద్ర రూల్స్‌కు నిరసనగా ఇవాళ్టి నుంచి జిన్నింగ్ మిల్లుల బంద్


తేమ సమస్య నుంచి బయటపడుతున్న తరుణంలో పరిస్థితి మళ్లీ మొదటికి.
పత్తి అమ్ముకుందామంటే… ఇదేం గోస?” అంటూ రైతుల ఆవేదన.
రాష్ట్రంలో అంచనా 25 లక్షల టన్నుల్లో… సీసీఐ కొనుగోలు చేసినది కేవలం 1.20 లక్షల టన్నులే.

హైదరాబాద్: వరుస వర్షాలు, తుపాన్లతో పత్తి పంట నష్టపోయి తేరుకుంటున్న రైతులపై మరో పిడుగుపడింది. పత్తి కొనుగోళ్లలో కేంద్ర సంస్థ సీసీఐ అవలంబిస్తున్న కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లులు ఇవాళ్టి నుంచి (నవంబర్ 17) రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రకటించాయి. దీంతో పత్తి మార్కెట్లు మరోసారి సంక్షోభంలోకి వెళ్లాయి.

సీసీఐ కొత్త నిబంధనలు రైతులు–మిల్లర్లకు ఇబ్బందే

జిన్నింగ్ మిల్లులకి ఎల్–1, ఎల్–2 కేటగిరీల అలాట్‌మెంట్, కపాస్ కిసాన్ యాప్‌లో తప్పనిసరి రిజిస్ట్రేషన్, ఎకరానికి కేవలం 7 క్వింటాళ్ల కొనుగోలు వంటి నిర్ణయాలు మిల్లర్లను, రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆరోపించింది.

మిల్లర్ల వినతులను పరిగణించకుండా సీసీఐ కఠిన నిర్ణయాలు కొనసాగిస్తుండటంతో నిరసనగా బంద్ తప్పనిసరి అయిందని సంఘం ప్రకటించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రైతులకు స్మార్ట్‌ఫోన్‌లు లేకపోవడం వల్ల యాప్ రిజిస్ట్రేషన్ పెద్ద అడ్డంకిగా మారింది.

పంటనష్టం… తేమ సమస్య… ఇప్పుడు మిల్లుల బంద్

తాజా మోంథా తుఫాన్, అకాల వర్షాలతో రాష్ట్రంలో 1,51,707 ఎకరాల్లో పత్తి పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. వరంగల్, హన్మకొండ, జనగాం, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, నాగర్కర్నూల్, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో భారీ నష్టం నమోదైంది.

వర్షాల కారణంగా పత్తిలో తేమశాతం 25% వరకు పెరిగి రైతులు మార్కెట్‌కు అమ్మలేకపోయారు. ఇప్పుడిప్పుడే ఎండలు కనిపించి తేమ తగ్గుతుండగా… కొనుగోళ్లు ఊపందుకునే టైంలో మిల్లుల సమ్మే ప్రకటనతో రైతుల పరిస్థితి మళ్లీ మొదటి దశకు చేరింది.

సీసీఐ కొనుగోళ్లు చాలా తక్కువ

ఈ వానాకాలంలో రాష్ట్రంలో 45.85 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం 27 లక్షల టన్నుల పత్తి దిగుబడి వచ్చే అవకాశం.

కానీ ఇప్పటివరకు సీసీఐ కొనుగోలు సెంటర్ల ద్వారా
➡️ రైతుల సంఖ్య – 67,000 మంది
➡️ కొనుగోలు చేసిన పత్తి – 1.18 లక్షల టన్నులు మాత్రమే

మొత్తం పత్తిలో ఇది చాలా తక్కువ శాతం. దాంతో రైతులు ప్రైవేట్ మార్కెట్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి.

రోజుకో నిబంధన – రైతులకు పెనుభారం

సీసీఐ గత సీజన్‌లో ఎకరాకు 12 క్వింటాళ్లు తీసుకోగా, ఈసారి 7 క్వింటాళ్లకు తగ్గించడం రైతులను ఆగ్రహానికి గురిచేస్తోంది. తేమ 8–12% పైగా ఉంటే కొనమని పెట్టిన షరతు కూడా ప్రాక్టికల్ కాదని రైతుల వాదన.

ఇదిలా ఉంటే… కేంద్రం దిగుమతి సుంకాలు తగ్గించడంతో దేశవ్యాప్తంగా పత్తి ధరలు భారీగా పడిపోయాయి. దాంతో బహిరంగ మార్కెట్లో దళారులు, వ్యాపారులు కలిసి ధరలను మరింత తగ్గించేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇక మిల్లుల బంద్‌తో రైతులు పూర్తిగా చిక్కుల్లో పడిపోయారు.


“ఎల్–1, ఎల్–2 విధానాలు అన్యాయం… మిల్లులు నడవాల్సిందే”

– బొమ్మినేని రవీందర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్

“ఎల్–1, ఎల్–2 విధానాలు పూర్తిగా అన్యాయం. సమస్యల గురించి ఎన్నిసార్లు తెలిపినా సీసీఐ స్పందించలేదు. ఈ నిర్ణయాలు కొనసాగితే జిన్నింగ్ పరిశ్రమే మూతపడే ప్రమాదం ఉంది. అందుకే బంద్ తప్పలేదు” అని తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793