భిలాస్‌పూర్‌లో రైలు ప్రమాదం – ఆరుగురు దుర్మరణం
చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని భిలాస్‌పూర్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రైలుప్రమాదం చోటుచేసుకుంది. హౌరా మార్గంలోని జైరామ్‌నగర్ స్టేషన్ సమీపంలో కోర్బా ప్యాసింజర్ రైలు, నిలిచి ఉన్న గూడ్స్ ట్రైన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనీసం ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, బిలాస్‌పూర్ నుంచి కోర్బా వైపు వెళ్తున్న కోర్బా ప్యాసింజర్ ట్రైన్ అధిక వేగంతో వస్తుండగా, జైరామ్‌నగర్ వద్ద ముందుగా నిలిచి ఉన్న సరుకు రైలును గమనించలేక ఢీకొట్టింది. ఢీ కొట్టిన దెబ్బకు ప్యాసింజర్ రైలు ముందు భాగం గూడ్స్ ట్రైన్‌పై ఎక్కిపోయింది. మొదటి బోగీ పూర్తిగా నలిగిపోయి, అనేక బోగీలు పట్టాలు తప్పాయి.
ప్రమాదం తర్వాత రైల్వే అధికారులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు కానీ, సిగ్నల్ లోపం లేదా మానవ తప్పిదం కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రమాదం కారణంగా బిలాస్‌పూర్–కోర్బా రైలు రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. రైల్వే శాఖ ఘటనపై దర్యాప్తు ఆదేశించింది.

Post a Comment