-->

సైబర్ క్రైమ్ పోలీసు కస్టడీకి ‘ఐ బొమ్మ’ ఇమ్మడి రవి

సైబర్ క్రైమ్ పోలీసు కస్టడీకి ‘ఐ బొమ్మ’ ఇమ్మడి రవి


హైదరాబాద్ : నవంబర్ 19: సినిమా పైరసీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ‘ఐ బొమ్మ’ ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఈ మేరకు కోర్టు బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పైరసీ మూవీ రాకెట్ ఐ బొమ్మ కేసులో ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు.

పైరసీ రాకెట్‌పై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు కస్టడీ అవసరమంటూ సైబర్ క్రైమ్ పోలీసులు వారం రోజుల కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి — ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీ మంజూరు చేశారు. దీంతో రవిని సీసీఎస్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని మరింత విచారణ జరపనున్నారు.

కొత్త సినిమాలు, ఓటీటీ కంటెంట్‌ను భారీ స్థాయిలో పైరసీ చేస్తూ చిత్ర పరిశ్రమకు కోట్ల రూపాయల నష్టం కలిగిస్తున్నాడన్న ఆరోపణలతో రవిని గత శనివారం కూకట్‌పల్లి ప్రాంతంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడు సంవత్సరాలుగా ఐ బొమ్మ, బప్పం, ఐ విన్, ఐ రాధ టీవీ వంటి పేర్లతో పలు వెబ్‌సైట్లను నడిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది.

రవికి చెందిన అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన సోదాల్లో పోలీసులు రూ.3 కోట్లు నగదు, వందల సంఖ్యలో హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని బషీర్‌బాగ్ సీసీఎస్ కార్యాలయానికి తరలించి విచారించారు. తాజాగా కోర్టు ముందు హాజరుపరచగా, ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి లభించింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793