-->

42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి: ఆర్. కృష్ణయ్య డిమాండ్

42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి: ఆర్. కృష్ణయ్య డిమాండ్


హైదరాబాద్ | డిసెంబర్ 15: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల మూడో విడత ముగియగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా క్షేత్రస్థాయిలో వచ్చిన రాజకీయ అంచనాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్న అధికార పార్టీ, ఇదే ఊపులో పరిషత్ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే ఈ నెలలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా అధికార యంత్రాంగం ఆలోచన చేస్తోంది. ఇప్పటికే అందిన మౌఖిక ఆదేశాలతో పంచాయతీ రాజ్ శాఖ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేసినట్లు తెలిసింది.

పంచాయతీ ఎన్నికలు ముగింపు దశలో

పంచాయతీ ఎన్నికల తొలి విడత ఇప్పటికే పూర్తికాగా, రెండో విడత ఆదివారంతో ముగిసింది. మూడో విడతను ఈ నెల 17న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో ఈ నెల 20 నాటికి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తికానుంది.

అనంతరం జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ పరిషత్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అన్ని ఏర్పాట్లు పూర్తైతే, ఈ నెల 23 లేదా 27 తేదీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇప్పటికే ఓటర్ల జాబితా, మండల స్థాయి ఎంపీటీసీలు, జిల్లా స్థాయి జడ్పీటీసీల లెక్కలు ప్రభుత్వానికి సిద్ధంగా ఉండటంతో, ఎన్నికలకు వెళ్లడమే మిగిలిందని అధికారులు చెబుతున్నారు.

42% బీసీ రిజర్వేషన్లపై ఆర్. కృష్ణయ్య డిమాండ్

ఈ పరిణామాల నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య స్పందించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే నిర్వహించాలి అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పార్టీల పరంగా జరిగే ఈ ఎన్నికల్లో చట్టబద్ధంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం మోసం చేసిందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

బీసీలకు న్యాయం జరగాలంటే మాటలకే పరిమితం కాకుండా, ఎన్నికల ప్రక్రియలోనే రిజర్వేషన్లు అమలు చేయాలని ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793