హైదరాబాద్‌లో యువకుడి దారుణ హత్య… అక్రమ సంబంధమే కారణమా?
హైదరాబాద్, డిసెంబర్ 15: హైదరాబాద్ మహానగరంలో మరో దారుణ హత్య కలకలం రేపింది. టోలిచౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారామౌంట్ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి ఇర్ఫాన్ (24) అనే యువకుడు కత్తిపోట్లకు బలయ్యాడు. అక్రమ సంబంధం నేపథ్యంలో చోటుచేసుకున్న గొడవే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
పోలీసుల కథనం ప్రకారం… బిలాల్ అనే వ్యక్తి తన భార్యకు, మృతుడు ఇర్ఫాన్ తమ్ముడు అద్నాన్‌కు మధ్య అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో అద్నాన్‌ను మాట్లాడటానికి పిలిచాడు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని, అది కాస్తా ఘర్షణకు దారి తీసింది.
తమ్ముడు అద్నాన్‌పై దాడి జరుగుతోందన్న సమాచారం అందుకున్న ఇర్ఫాన్ గొడవను ఆపేందుకు సంఘటన స్థలానికి చేరుకున్నాడు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బిలాల్ ఇర్ఫాన్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఇర్ఫాన్ ఛాతిలో తీవ్ర గాయాలయ్యాయి.
తీవ్రంగా గాయపడిన ఇర్ఫాన్‌ను వెంటనే ఆలివ్ హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అదే ఘటనలో అద్నాన్ కూడా తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నాడు.
సమాచారం అందుకున్న టోలిచౌకీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడు బిలాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పూర్తి వివరాలపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
నగరంలో వరుసగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Post a Comment